Complete Health Awareness

పరిపూర్ణ ఆరోగ్యముఅవగాహన , Complete health-awareness 

complete health

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా, ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు పరిపూర్ణ ఆరోగ్యముఅవగాహన , Complete health-awareness – గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి.

  • మన పయనం… విజయం నుంచి విజయానికి! ఒకప్పుడు వ్యాధులను జయించటమే గొప్ప. క్షయ, ప్లేగు, కుష్టు, సిఫిలిస్‌, గనేరియా.. ఇలా మానవాళిని కబళించి, మారణహోమం చేసిన వ్యాధులెన్నో. వీటితో తంటాలుపడి.. తలపడి.. సమర్థ ఔషధాల ఆవిష్కారంతో ఈ వ్యాధులను వదిలించుకుంటూ.. ఆరోగ్య పరిరక్షణలో చాలా దూరమే వచ్చాం. ఇది చిన్న విజయమేం కాదు!

ఇప్పుడు మన ఆలోచన మారుతోంది. మన లక్ష్యం విస్తరిస్తోంది. చక్కటి ఆరోగ్యమంటే… కేవలం వ్యాధుల్లేకపోవటమే కాదు. ఎటువంటి జబ్బులూ బాధలూ లేకపోవటం ఆరోగ్యానికి మూలమేగానీ… జబ్బు లేకుండా తిని తిరుగుతుండటాన్నే మనం ‘ఆరోగ్యం’ అనలేం. ‘పరిపూర్ణ ఆరోగ్యం’ అన్నది మన లక్ష్యం కావాలన్నది నేటి వైద్యరంగంఆలోచన!

కేవలం జబ్బుల్లేనంత మాత్రాన మనం జీవితంలో సుఖంగా, సంతోషంగా ఉంటామన్న భరోసా ఏంలేదు! పరిపూర్ణ ఆరోగ్యమంటే.. శారీరకంగానే కాదు.. సామాజికంగా, మానసికంగా, వృత్తిపరంగా, భావోద్వేగపరంగా..ఆధ్యాత్మికంగా.. అన్ని రకాలుగా హాయిగా.. స్వస్థతతో ఉండటం! అప్పుడే మనం ఏ చీకూచింతా లేకుండా.. జీవితంలోని ఆనందాన్నీ.. మకరందాన్నీ ఆస్వాదించగలుగుతాం. చక్కటి ఆయుర్దాయంతో.. సంతోషంగా జీవించగలుగుతాం. అందుకే నేటి వైద్యరంగం.. వ్యాధుల చికిత్స నుంచి నియంత్రణ వైపు.. నియంత్రణ నుంచి వ్యాధుల నివారణ వైపు… కేవల ‘ఆరోగ్యం’ నుంచి ‘పరిపూర్ణ ఆరోగ్యం’        వైపు   దృష్టి   సారిస్తోంది.

పరిపూర్ణ ఆరోగ్యమన్నది వైద్యంతో.. మందులతో సాధించేది కాదు. ఇది ఆసాంతం మన జీవనశైలితో.. మన అలవాట్లతో.. మన ఆలోచనలతో, భావోద్వేగాలతో ముడిపడిన వ్యవహారం. మన ఆరోగ్యానికి మనమే బాధ్యత తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పే విభాగం. భౌతికంగా, శారీరకంగానే కాదు.. మానసికంగా, సామాజికంగా కూడా మనిషిని ఆరోగ్యకరంగా తీర్చిదిద్దే బహుముఖీన విధానం. అందుకే ఈ లక్ష్య సాధనలో మన అడుగులు ఎటు కదలాలో… మన ఆలోచనలు ఏ దిశగా సాగితే మంచిదో..తెలుసు కుందాం .

  • వృత్తిగత ఆరోగ్యం

సామర్థ్యం,    తృప్తి   ముఖ్యం—
ఉద్యోగంలో వ్యక్తిగతంగా మనకు తృప్తి, సంతోషం లభించటమన్నది ఆరోగ్యానికి చాలా కీలకమైన అంశం. వృత్తిలో, ఉద్యోగంలో మన నైపుణ్యాలనూ, సామర్ధ్యాలనూ సంపూర్ణంగా వినియోగిస్తున్నప్పుడు మనకు అర్థవంతంగా పని చేస్తున్నామన్న గొప్ప తృప్తి కలుగుతుంది. పని చేయటం ద్వారా మన జీవితం మరింత ఎత్తులకు వెళుతున్న పాజిటివ్‌ భావన కలుగుతుంది. ఉద్యోగంలోగానీ, స్వచ్ఛంద కార్యక్రమాల్లోగానీ మనసు పెట్టి హృదయపూర్వకంగా పని చేసినప్పుడు, వృత్తిపరంగా మనం సరైన దారిలో నడుస్తున్నప్పుడు మన పని, మన వ్యాపకాలే మనకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తాయి, అద్భుతమైన అనుభూతిని మిగులుస్తుంటాయి. పనిలో అంటీముట్టనట్టుండటం, క్రియాశూన్యంగా ఉండటం మన ఆరోగ్యానికే మంచిది కాదు. మీరు ఎంచుకునే వృత్తి, ఉద్యోగంలో తృప్తి, పైకి ఎదగాలన్న ఆకాంక్ష, పని సామర్థ్యం.. ఇవన్నీ కూడా మన పరిపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేసే అంశాలే. అలాగే ఎప్పుడూ పనితో సతమతమవుతుంటే.. జీవితంలో సుఖశాంతులు అడుగంటుతాయి. లక్ష్యాలను చేరుకోలేకపోతుండటం, రోజుకు 24 గంటలకంటే ఎక్కువ టైముంటే బాగుండుననిపిస్తుండటం.. ఇవన్నీ సమయ పాలన సరిగా లేదని చెప్పే అంశాలు. ప్రాధాన్యం ప్రకారం పనిని వాయిదా వెయ్యకుండా చేసుకుంటూపోవటం, ఉన్న సమయానికి మించి ఎక్కువ పనులు నెత్తినేసుకోకుండా.. అవసరమైతే నిర్మొహమాటంగా ‘చెయ్యలేను’ అని చెప్పగలగటం, వీలైనచోట పని బాధ్యతలను ఇతరులకు అప్పగించటం.. ముఖ్యంగా విశ్రాంతి, వ్యక్తిగతమైన సరదాల సమయం హరించుకుపోకుండా చూసుకోవటం.. ఇవన్నీ ముఖ్యమైన అంశాలు.

 

మేధో ఆరోగ్యం

కుతూహలమే ఇంధనం–

మనం అంతగా గుర్తించంగానీ… మేధోపరంగా ఆరోగ్యంగా ఉండటమన్నది ప్రతి మనిషి అస్థిత్వానికి ఎంతో కీలకం. జీవించినంత కాలం.. జీవితం మీద ఆసక్తి తగ్గకూడదు. నిర్లిప్తతలోకి జారిపోకుండా.. సామాజికంగా ముడుచుకుపోకుండా.. నిరంతరం కుతూహలంతో ఉండటం ముఖ్యం. అందుకు మేధోపరంగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించటం ఎంతో అవసరం. మన మేధస్సుకు సృజనాత్మకంగా, స్ఫూర్తిమంతంగా ప్రేరణనిచ్చే అంశాలపై శ్రద్ధపెట్టాలి. మేధోపరంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి.. తన విజ్ఞానాన్నీ, అవగాహనా ప్రపంచాన్నీ విస్తరించుకుంటూ.. తన విజ్ఞాన ఫలాలను నలుగురితో పంచుకుంటూ ఉంటాడు! నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవటం, పుస్తకాలు, పత్రికలు చుదువుతుండటం, పజిల్స్‌-సమస్యల వంటివి పరిష్కరించటం, సృజనాత్మకంగా ఆలోచించటం అవసరం. ప్రస్తుతం మన సమాజంలో, మన చుట్టుపక్కల ఏం జరుగుతోందో, కొత్తకొత్త ఆలోచనలు, ఐడియాలు ఏమేం వస్తున్నాయో తెలుసుకోవాలన్న కుతూహలాన్ని ఎప్పుడూ చంపుకోకూడదు. మనకున్న విజ్ఞానంతో మనకు మనమే సంతృప్తిపడిపోతూ.. కొత్తగా చేసేదేమీ లేకుండా నిరర్ధకంగా మారిపోవటం పరిపూర్ణ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. కొత్తగా ఏదో ఒకటి చెయ్యాలన్న కుతూహలం, ఏదో ఒకటి తెలుసుకోవాలన్న ఉత్సుకత… మన మేధస్సుకు నిరంతరం సవాళ్లు విసురుతుంటుంది, ఫలితంగా మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లు మనకు అడ్డంకుల్లా, ప్రతిబంధకాల్లా కనబడవు, అవే విజయానికి మెట్లలా కనబడటం ఆరంభమవుతుంది. రకరకాల పుస్తకాలు, పత్రికలు చదువుతుండటం, కొత్తకొత్త విద్యలు, భాషలు, నైపుణ్యాలు, కళలు నేర్చుకుంటూ ఉండటం.. మేధోపరమైన అవసరం, అది ఏ వయస్సులోనైనా సరే!

మానసిక ఆరోగ్యం

కనిపించని సమస్య–

శరీరమూ, మనస్సూ విడదీయరానివేగానీ సంప్రదాయంగా మనం శారీరక ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ.. మానసిక ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నాం. అందుకే మానసిక సమస్యలను గుర్తించకపోవటం, ఈ సమస్యలతో బాధపడేవారిని చిన్నచూపు చూస్తూ హేళన చేయటం ఎక్కువ. ఈ ధోరణి మనకూ చేటు చేస్తుంది. ఎందుకంటే మనలో చాలామందికి కుంగుబాటు (డిప్రెషన్‌),ఆందోళన (యాంగ్జయిటీ) లక్షణాలు కనబడుతుంటాయి. ఇవి దైనందిన జీవితంలో సుఖశాంతులు లేకుండా చేస్తాయి. ఉద్యోగ జీవితంలోనూ ఇబ్బందులు తెచ్చిపెడతాయి. అయినా దాన్నో సమస్యగా గుర్తించేందుకు ఎవరూ ఇష్టపడరు, దీనికి చికిత్స తేలికే అయినా అందుకు సిద్ధపడటం లేదు. కొందరిని ఒళ్లు నొప్పులు, కడుపునొప్పి వంటివి విడవకుండా బాధిస్తుంటాయి, ఎన్ని పరీక్షలు చేసినా ఏమీ బయటపడదు. డిప్రెషన్‌ వంటి మానసిక సమస్యల లక్షణాలు ఇలానూ బయటపడొచ్చని గుర్తించాలి. వృద్ధుల్లో ఆకలి తగ్గటం, నిద్ర పట్టకపోవటం, నిస్సత్తువ వంటి మానసిక సమస్యల లక్షణాలు కనబడుతున్నా ‘పెద్దవయసులో ఇవి మామూలేలే!’ అని కొట్టిపారెయ్యటం.. ఎవరైనా కాస్త భిన్నంగా ప్రవర్తిస్తుంటే ‘పెంకి మనుషులు’, ఎప్పుడూ ‘ఏదో నస పెడుతుంటారు’ అంటూ ముద్ర వెయ్యటం చేస్తుంటారు. కొందరు మానసిక సమస్యల కారణంగా మద్యం, మాదక ద్రవ్యాల వంటివాటికీ చేరువ అవుతారు. ఇవన్నీ విస్మరించటానికి వీల్లేని అంశాలు. నిత్య వ్యాయామం, తగినంత నిద్ర విశ్రాంతి, హాస్యంతో సరదాగా, సానుకూలంగా, సృజనాత్మకంగా ఉండే ధోరణి, చక్కటి ప్రేమానురాగాలు పొందటం, పంచటం.. ఇవన్నీ మానసిక ఆరోగ్యానికి చాలా కీలకం!